: చెట్టు రోబోలు వస్తున్నాయోచ్!
ఇప్పటి వరకూ మనుషులను పోలిన రోబోలను శాస్త్రవేత్తలు రూపొందిస్తూ వచ్చారు. అయితే అందరూ చేసే పనిచేస్తే అందులో కొత్తేముంది... కొత్తగా... కొత్తగా ఏదైనా చేయాలి. అప్పుడే మన గురించి లోకానికి తెలుస్తుందికదా... అందుకే కొందరు శాస్త్రవేత్తల బృందం మనుషుల్లాగా కాకుండా చెట్లను పోలిన రోబోలను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటాలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బార్బరా మజోలై బృందం మొక్కలను పోలివుండే రోబోలను తయారు చేసింది. ఈ రోబో చెట్లు వేర్లు, నిజమైన చెట్టు వేర్లు నిర్వర్తించే అన్ని విధులను నిర్వర్తిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఎక్కువ ఘర్షణ లేకుండా వీటి వేర్లు భూమిలోకి చొచ్చుకునిపోయి అక్కడి నీరు, ఉష్ణోగ్రత, పీహెచ్, నైట్రేట్, ఫాస్ఫేటులను కూడా కనుగొంటాయని చెబుతున్నారు. సాధారణ మొక్కలాగే వీటి వేర్లు కూడా ఎదుగుతాయని, ఆ క్రమంలో ఈ రోబో వేర్లు పరస్పరం సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము సృష్టించిన ఈ రోబో చెట్లు పర్యావరణ పరిరక్షణకు, ఇతర గ్రహాలపై పరిశోధనకు చక్కగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే వైద్య, ఔషధ రంగాల్లో కూడా వీటిని వినియోగించే రోజులు వస్తాయని వీరు చెబుతున్నారు!?