: మోడీ మాటలు నమ్మొద్దంటున్న కిరణ్


హైదరాబాదులో నిన్న నవభారత యువభేరి సభలో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బదులిచ్చారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మోడీ విమర్శల్లో పసలేదన్నారు. మోడీ గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ లను ఆదర్శరాష్ట్రాలుగా పేర్కొనడాన్ని కిరణ్ సరికాదన్నారు. ఆ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పథకాల కంటే ఉత్తమ పథకాలనే తాము ప్రవేశపెట్టామని తెలిపారు.

గుజరాత్ లో 52 వేలమందిని స్కిల్ డెవలప్ మెంట్ ప్రక్రియలో భాగస్వాములుగా చేర్చితే.. ఏపీలో 3 లక్షల 25 వేల మందికి నైపుణ్యాల కల్పనతో పాటు ఉద్యోగాలు కూడా కల్పించాయని సీఎం వివరించారు. అదే సమయంలో తమిళనాడులో లక్షా అరవై వేలమందికే ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. ఇక రూపాయికే కిలో బియ్యం పథకాన్ని మన రాష్ట్రంలో 94 శాతం విజయవంతంగా అమలు చేస్తుంటే, గుజరాత్ లో ఇదే పథకం 33 శాతమే అమలవుతోందని ఎద్దేవా చేశారు.

అమ్మహస్తం ద్వారా చవకగా 9 నిత్యావసర వస్తువులందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రతిదానికి మధ్యప్రదేశ్ ను ఆదర్శంగా చెబుతున్న మోడీ.. ఆ రాష్ట్రంలో లఖ్ పతి లక్ష్మీయోజన పథకాన్ని గుజరాత్ లో ఎందుకు ప్రవేశపెట్టలేదని కిరణ్ సూటిగా ప్రశ్నించారు. మన రాష్ట్రంలో అన్ని పథకాల కంటే మేలైన రీతిలో బంగారుతల్లి పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. పైగా, ఆ పథకానికి చట్టబద్ధత కూడా కల్పించామని సీఎం విపులీకరించారు.

ఇతర రాష్ట్రాలను చూసి నేర్చుకునే స్థితిలో మన రాష్ట్రం లేదని, మనమే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టడమే కాకుండా, దానికోసం చట్టం చేశామని తెలిపారు. ఇలా, ఏపీని అగ్రస్థానంలోకి తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News