: రాజ్యసభలో ఎలుగెత్తిన సుజనా చౌదరి
టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై రాజ్యసభలో చర్చ ప్రారంభించారు. ఉదయం నుంచి తమకు అవకాశం ఇవ్వాలంటూ ఎంపీలు నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ అంగీకరించారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ.. ఐదు రోజుల పాటు సభాసమయాన్ని తమ నిరసన కారణంగా వృథా చేసినందుకు సభకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. రూ.25 కోట్ల ఖర్చుతో శ్రీకృష్ణ కమిటీని ప్రభుత్వం నియమించిందని, పదినెలల కాలపరిమితితో ఆ కమిటీ తీవ్రంగా శ్రమించి నివేదిక అందించిందన్నారు. అయితే, 30 నెలలుగా ఆ నివేదికను ప్రభుత్వం పట్టించుకోలేదని, చెత్తబుట్టలో పడేసిందని సభకు తెలిపారు.
కొత్త రాజధాని ఏదన్న విషయంలో స్పష్టత లేకపోవడం ప్రజల్లో గందరగోళానికి దారి తీసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఉద్యమాలు అంతర్యుద్ధాన్ని తలపిస్తున్నాయని వివరించారు. హైదరాబాదును పదేళ్ళు ఇరు రాష్ట్రాలకు రాజధానిగా ప్రకటించడం పట్ల పలు అనుమానాలున్నాయన్నారు. హైదరాబాదు నగరం కోసం సీమాంధ్రులు ఎంతో శ్రమించారని సుజనా స్పష్టం చేశారు. కొత్త రాజధానికి అవసరమయ్యే నిధులన్నీ కేంద్రమే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడంతో ఆంటోనీ ఆధ్వర్యంలో మరో కమిటీ వేశారని చెప్పారు. వివిధ సందర్భాల్లో దిగ్విజయ్ సింగ్ ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంగా భావిస్తోందని ఆరోపించారు.