: కాలేజీలలో కొట్లాటల నివారణకు బౌన్సర్లు
డిస్కో థెక్ లు, బార్లలో, సెలబ్రిటీల రక్షణకు బౌన్సర్లను చూశాం. కానీ, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వెళితే కాలేజీలలోనూ బౌన్సర్లు కనిపిస్తారు. అడ్మిషన్ల కాలం కావడంతో.. కాలేజీలలో సీట్ల కోసం విద్యార్థులు గొడవలకు దిగుతున్న నేపథ్యంలో, నగరంలోని మూడు కాలేజీలు బౌన్సర్లను నియమించుకున్నాయి. బౌన్సర్ల పనేంటో తెలిసిందే కదా. గొడవ చేసే వారిని గట్టిగా మందలిస్తారు. వినకపోతే ముష్ఠి ఘాతాలతో దారికి తెస్తారు.
అదేంటో, బౌన్సర్ల అవసరం రోజురోజుకీ పెరిగిపోతోంది. అహ్మదాబాద్ లోనే ఒక స్కూల్ యాజమాన్యం కూడా బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంది. ఫీజులను ఇష్టారీతిగా పెంచడంపై ఇటీవలే విద్యార్థుల తల్లిదండ్రులు సదరు స్కూలులో నిరసన చేపట్టారు. దీంతో ఆ స్కూల్ యాజమాన్యం బౌన్సర్లను రంగంలోకి దింపింది.