: దంపుడు బియ్యమే మేలు
చక్కగా పాలిష్ పట్టించి, తెల్లగా ముత్యాల్లాగా మెరిసేటి సన్నబియ్యంతో అన్నం వండితే అసలు తినే విషయమే తెలియకుండా ఇట్టే గొంతులోకి అన్నం ముద్ద జారిపోతుంది. మనలో చాలామందికి ఇలాంటి సన్నబియ్యం తినడమే ఇష్టం. ఏమాత్రం బియ్యం లావుగా ఉన్నా వారికి ముద్ద మింగుడు పడదుమరి. అయితే ఇలాంటి సన్నబియ్యం తినడం వల్ల మన ఆరోగ్యం కూడా సన్నబడిపోతుందట. ఈ విషయం ఎప్పటినుండో మనందరికీ తెలిసినా సన్నబియ్యంపై మనకున్న ఆశను మాత్రం సన్నబడనీయం. ఎంచక్కా పాలిష్డ్ బియ్యాన్ని వండుకుని తింటుంటాం.
ఒకప్పుడు ఇళ్లల్లో అన్నం వండేందుకు వడ్లను దంచి వచ్చిన బియ్యంతో అన్నం వండేవారు. ఈ బియ్యం తినడం వల్ల అప్పట్లో మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండేవారు. అయితే క్రమేపీ బియ్యాన్ని పాలిష్ పట్టించడం ప్రారంభమైంది. దీంతో మనుషుల్లో కూడా ఆరోగ్యం తగ్గుతూ వచ్చింది. అయితే పాలిష్ పట్టించిన బియ్యం తినడంకన్నా కూడా దంపుడు బియ్యం తినడం ఎంతో ఆరోగ్యమని ఫిలిఫ్పీన్స్ ప్రభుత్వం చెబుతోంది. తాజా పరిశోధనల్లో దంపుడు బియ్యం తినడం వల్ల పలు రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని తేలింది. ఇదే విషయాన్ని ఆ ప్రభుత్వం తమ ప్రజలకు చెబుతోంది. ఆ దేశంలో తెల్లగా పాలిష్ పట్టించిన బియ్యాన్ని ఎక్కువమంది ప్రజలు తింటున్నారని, దీనివల్ల త్వరలోనే ప్రజారోగ్యం పాడైపోతుందని, మధుమేహం వంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదముందని ఆ దేశ ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది.
బియ్యంపైన ఉండే పొట్టును మాత్రమే తీసి తింటే మేలని, అలాకాకుండా బియ్యంపైని ఉండే సన్నటి తవుడును కూడా తీసేసి తెల్లగా పాలిష్ పట్టించిన బియ్యంతో వండిన అన్నం తినడం వృధా అని పరిశోధకులు చెబుతున్నారు. పైపొట్టు మాత్రమే తీసిన బియ్యంలో నియాసిన్, థయమిన్, భాస్వరం, విటమిన్`ఎ వంటివి సమృద్ధిగా ఉంటాయని, పాలిష్ చేసిన బియ్యం త్వరగానే జీర్ణమైపోతుందని దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు.