: ఒడిసాలో బొగ్గు కుప్పలు కూలి 14 మంది సమాధి


బొగ్గు ఏరుకుంటున్న నిరుపేదలు ఆ బొగ్గు గుట్టల కిందే సమాధి అయిపోయారు. ఒడిసాలోని సుందర్ గఢ్ జిల్లా మహానంది కోల్ ఫీల్డ్స్ వద్ద నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బసుంధర, గర్జన్ బాల్ ప్రాంతంలోని కుల్దా ఓపెన్ కాస్ట్ మైన్ వద్ద పోగేసిన బొగ్గు గుట్టల నుంచి సమీప గ్రామాలకు చెందిన వారు బొగ్గులను ఏరుకుని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఒక్కసారిగా బొగ్గు కుప్పలు కూలి వారి మీద పడిపోవడంతో సమాధి అయ్యారు. వెంటనే సహాయక కార్యక్రమాలను చేపట్టిన అధికారులు 10 మృత దేహాలను వెలికి తీశారు. గాయాలతో ఉన్న ఐదుగురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.

ఈ ఉదయం మళ్లీ సహాయక కార్యక్రమాలు తిరిగి ప్రారంభం కాగా, మరో నాలుగు మృత దేహాలు బయటపడ్డాయి. దీంతో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. శిధిలాల కింద మరి కొంత మంది ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మహానంది కోల్ ఫీల్డ్స్ 3 లక్షలు, రాష్ట ప్రభుత్వం 2 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించాయి.

  • Loading...

More Telugu News