: 13 నుంచి సీమాంధ్ర వాణిజ్యపన్నుల సిబ్బంది సమ్మె
సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చి తారస్థాయికి చేరుతోంది. ఏపీఎన్జీవోలు ఉద్యమానికి మద్దతు పలికిన నేపథ్యంలో వారికి పలు ఉద్యోగుల సంఘాల నేతలు, కార్మికులు సంఘీభావం పలుకుతున్నారు. తాజాగా సమైక్యాంధ్ర సమ్మెకు వాణిజ్యపన్నుల జేఏసీ మద్దతు తెలిపింది. దానికనుగుణంగా 13 వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు ఆ సంఘం కార్యదర్శి జి సత్యనారాయణ తెలిపారు. సమ్మె కారణంగా రాష్ట్ర సరిహద్దుల్లోని తనిఖీ కేంద్రాలు కూడా మూతపడనున్నాయి.
రాష్ట్ర ఆదాయంలో 70 శాతం వాణిజ్య పన్నుల ద్వారానే సంక్రమిస్తున్నందున ఆంధ్రప్రదేశ్ ఖజానాపై సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఆంటోనీ కమిటీకి చట్టబద్దత లేనందువల్ల దానికి సమస్యలు నివేదించడం వల్ల ప్రభావం ఉండదని ఎన్జీవోలు చెబుతున్నారు. అందుచేత తక్షణం కేంద్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, అన్ని వర్గాల వారితో చర్చలు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.