: హైదరాబాద్ లో నరేంద్రమోడీ తొలి ఎన్నికల ప్రచారసభ నేడే


హైదరాబాద్ లో నరేంద్రమోడీ తొలి ఎన్నికల ప్రచారసభ నేడు జరగనుంది. ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయజనతాపార్టీ ఎన్నికల ప్రచార సారధి నరేంద్ర మోడీ హాజరు కానున్న 'నవభారత యువభేరి' కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వేదిక నుంచి తన తొలి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ పాల్గొనే వంద సభల్లో ఇదే మొదటిది కావటంతో రాష్ట్ర భాజపా నేతలు దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ వేదికకు ఇరువైపులా స్వామి వివేకానంద, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కటౌట్లను ఏర్పాటు చేశారు. వర్షం కురిసినా సభ సజావుగా సాగేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు దాదాపు 1.20 లక్షల మంది యువ ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ రోజు మోడీ హైదరాబాద్ పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నరేంద్రమోడీ ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బంజరాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ కు వెళతారు. అక్కడ 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రముఖులతో భేటి-పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 2.30 గంటల నుంచి అదే హోటల్ లో మాజీ న్యాయమూర్తులు, విశ్రాంత ఐపీఎస్ లు, సినీప్రముఖులు, వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 4.00 గంటలకు 'నవభారత యువభేరి' సభలో మోడీ ప్రసంగిస్తారు. నారాయణ గూడ కేశవ మెమోరియల్ పాఠశాలలో 6.20 గంటలకు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటలకు హోటల్ కత్రియాలో భాజపా రాష్ట్ర పదాధికారులతో సమావేశమవుతారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం చేరుకొని రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో గుజరాత్ బయలుదేరి వెళతారు.

  • Loading...

More Telugu News