: ఇక సమరమే: ఏపీఎన్జీవో
సీమాంధ్రలో రగులుతున్న సమైక్యవాదాన్ని ఇక జాతీయస్థాయిలోనూ వినిపిస్తామంటున్నారు ఏపీఎన్జీవో నేతలు. విజయవాడలో నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజకీయ నాయకుల స్వార్థం కోసమే రాష్ట్రాన్ని విభజించారని ఎపీఎన్జీవో అధ్యక్షుడు ఎన్.అశోక్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారనడానికి సీమాంధ్రలో ఉద్యమాలే సాక్ష్యం అని చెప్పారు. ఇక, కోట్లు ఖర్చు చేసి శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇస్తే, దాన్ని బుట్టదాఖలు చేశారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంలోని ఏ వ్యవస్థ ఆ నివేదికను అధ్యయనం చేయలేదని, అందులోని ఆరు ఆప్షన్లలో ఏ ఒక్కదాన్నీ పట్టించుకోలేదని తెలిపారు.
ముఖ్యంగా ఐదు, ఆరు ఆప్షన్లను అనుసరించి ఉంటే, ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని ఆయన పేర్కొన్నారు. ఎంతో అనివార్యమైతే తప్ప మూడు ప్రాంతాల ప్రజలను విడదీయరాదని కమిటీ చెప్పినా, ఆ సూచనలను కాంగ్రెస్ పెడచెవిన పెట్టిందన్నారు. తత్ఫలితమే సీమాంధ్రలో ఉద్యమ జ్వాలలని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షను పట్టించుకోని ఎంపీలకు పదవుల్లో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు.