: తీవ్ర రూపం దాలుస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం
సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ సందర్భంగా రెండు రోజులు కాస్త వెసులుబాటు కల్పించిన ఉద్యమ కారులు సీమాంధ్ర 13 జిల్లాల్లో కదం తొక్కారు. ఆందోళనలు, నినాదాలు, నిరసనలు, దీక్షలతో హోరెత్తించారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సాధారణ పౌరులు అంతా కలిసి అడుగులో అడుగేస్తూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. తెలుగుజాతి గౌరవాన్ని మంటగలపొద్దని స్పష్టం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఏడు రోడ్ల కూడలిలో మున్సిపల్ ఉద్యోగులు, దర్జీలు, ఉద్యోగులు, ట్రాన్స్ పోర్టు సంస్థల యజమానులు, కార్మికులు భారీర్యాలీ చేశారు. విజయనగరం జిల్లా మయూరి జంక్షన్ లో విద్యార్థులు, ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, వర్తకులు పలు సంఘాల నేతలు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు. విశాఖపట్నంలో పలు సంఘాల నేతలు, విద్యార్థులు, జానపద కళాకారులు అంతా కలిసి జగదాంబ సెంటర్ వరకు భారీర్యాలీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించి, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాకినాడలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. ఎపీఎన్జీవోలు, విద్యార్థులు భానుగుడి సెంటర్ వరకు భారీ ర్యాలీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విద్యార్థులు, ఉద్యోగులు కదంతొక్కారు.
కృష్ణా జిల్లా విజయవాడలో విద్యార్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. బెంజ్ సర్కిల్ లో వ్యవశాయ శాఖ ఉద్యోగులు రోడ్ల మీదే నాట్లు వేసి తమ నిరసన తెలిపారు. గుంటూరులో విద్యార్థులు, ఉద్యోగులు పలు చోట్ల రిలే నిరాహార దీక్షలకు దిగారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలో సమైక్య నినాదాల హోరు జోరందుకుంది. పలు వర్సిటీల విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికులు ర్యాలీల్లో పాల్గొంటూ తిరుమలలో అప్రకటిత బంద్ వాతావరణం నెలకొల్పారు. బైక్ ర్యాలీలు, రిలేదీక్షలతో పలు రోడ్ల కూడళ్ళలో వాహనాలను అడ్డుకున్నారు. అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత రాజుకుంది. స్థానికులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీల నేతలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
కడప జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో సమైక్య ఉద్యమకారులు నినాదాలు చేశారు. సోనియాకు శాపనార్థాలు పెట్టారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో సమైక్యాంధ్ర ఉద్యమకారులు నిరసన దీక్షలు చేపట్టారు. తెలంగాణ, కేసీఆర్ వ్యతిరేక నినాదాలతో సెంటర్ ను హోరెత్తించారు. ఒంగోలు చర్చిసెంటర్ వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు.