: బీర్లు, రసగుల్లాలు ఇచ్చిపుచ్చుకున్న భారత - చైనా సైనికులు
సిక్కిం సరిహద్దుల్లో చైనా, భారత సైనికుల మధ్య ముఖాముఖి ఘర్షణ బీర్లు, రసగుల్లాలతో ముగిసిపోయింది. చైనా సైనికులు తూర్పు సిక్కింలోని 16,000 అడుగుల ఎత్తున తమ సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేస్తూ భారత్ వైపు ప్రవేశించడంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తంగ్ కర్ లాపాస్ వద్ద చైనా సైనికుల ప్రవేశాన్ని భారత దళాలు అడ్డుకున్నాయి. దీంతో ఇరు దేశాల సైనికులు తమ జాతీయ పతాకాలను ప్రదర్శించారు. తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని భారత సైనికులు కోరారు. భారత సరిహద్దులను వీడుతూ.. చైనా సైనికులు భారత సైనికులకు బడ్ వైజర్ బీర్లను కానుకగా ఇచ్చారు. వాటిని పుచ్చుకున్న భారత సైనికులు చైనా సైనికులకు రసగుల్లాలను అందివ్వడంతో ఘర్షణ వాతావరణం కాస్తా స్నేహపూర్వకంగా మారిపోయింది.