: సీఎం కర్రీ, టిఫిన్ పాయింట్ పెట్టుకుని ఇక్కడే బ్రతకొచ్చు : కేసీఆర్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో లేవనెత్తిన అంశాలపై కేసీఆర్ టీఆర్ఎస్ భవన్ లో నేడు వివరణాత్మకంగా బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు అని సీడబ్ల్యూసీ నిర్ణయించిందని తెలిపారు. నిన్న మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి అసత్య ప్రేలాపనలు పేలాడని, మతి స్థిమితంలేక మాట్లాడాడని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ఉండాలనుకుంటే కర్రీ పాయింటో లేక టిఫిన్ సెంటరో పెట్టుకుని ఇక్కడే ఉండొచ్చని సూచించారు. తానెవర్నీ వెళ్లి పొమ్మనలేదని, తాను అననిదాన్ని అన్నట్టు ప్రచారం చేయడం సరికాదని కేసీఆర్ హితవు పలికారు.
తెలంగాణపై సీఎం పచ్చి అబద్దాలు చెప్పాడని విమర్శించారు. అందుకు సాక్ష్యంగా హైకోర్టులో ఉద్యోగుల సంఖ్యను చూపించారు. తాను బార్ కౌన్సిల్ నుంచి సంపాదించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఎన్ రోల్డ్ అడ్వకేట్స్ 75 వేల మంది ఉన్నారన్నారు. వీరిలో 35 వేల మంది తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తే హైదరాబాద్ లో 15 వేల మంది పని చేస్తున్నారని తెలిపారు. వారిలో కేవలం 5 వేల మందే సీమాంధ్రులు ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. 1954లో జరిగిన రాష్ట్ర విభజన తరువాతే గుంటూరు లో హైకోర్టు ఏర్పడిందని, అంతకుముందే 1919లో తెలంగాణలో హైకోర్టు ఉందని తెలిపారు.
చరిత్రను కూడా తప్పుదోవ పట్టించలేరు కదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి అవగాహనలేక, సబ్జెక్ట్ లేక మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. విద్యుత్ పై సీఎం పూర్తి అవాస్తవాలు తెలిపారని ఆరోపిస్తూ తెలంగాణకు వాటాగా 3082 మెగావాట్ల విద్యుత్ వస్తుందని తెలిపారు. లోటు విద్యుత్ ను జూరాల, శంకర్ పల్లి, భూపాలపల్లిల్లో హైడ్రో, థర్మల్, గ్యాస్ పవర్ ప్లాంటులు నిర్మించి భర్తీ చేసుకుంటామని అన్నారు. మరిన్ని ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని అవి కూడా అందుబాటులోకి వస్తే అప్పుడు విద్యుత్ సమస్య ఉండదని తెలిపారు. ఇంకా అవసరమైతే సీమాంధ్రల్లో ఉన్న మిగులు విద్యుత్తునే కొనుక్కుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులు పనిచేయరు, పని చేయనివ్వరని ఎద్దేవా చేశారు.
ఉద్యమాల వల్ల, డిమాండ్ల వల్ల రాష్ట్రాలు ఏర్పడవు అని ముఖ్యమంత్రి అనడాన్ని తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడిందని ప్రశ్నిస్తూ, పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని మర్చిపోయావా? అని ప్రశ్నించారు. మూడు ప్రాంతాల ప్రజలతోను, నేతలతోనూ సమగ్రంగా చర్చించిన శ్రీకృష్ణ కమిటీ పరిష్కారాలు సూచించిందని, ఎవర్నీ అడక్కుండా విభజన జరగిందని అనడం సరికాదని అన్నారు. 57 ఏళ్ల పరిపాలనలో తమకు న్యాయం జరగలేదని కేసీఆర్ విమర్శించారు. సీమాంధ్ర పాలకుల అవివేకం, అసమర్థత వల్లే నదీ జలాలు సముద్రంలో అన్యాయంగా కలిసిపోతున్నాయని అన్నారు.
తెలంగాణలో బొగ్గు దొరికితే ఎక్కడో ఉన్న రాయలసీమలో థర్మల్ పవర్ ప్రాజెక్టు కట్టారని మండిపడ్డారు. ఇక మణుగూరులో కట్టాల్సిన థర్మల్ ప్రాజెక్టునూ విజయవాడ తరలించుకెళ్ళారని ఆరోపించారు. జలాల పంపిణీకి భారతదేశంలో చట్టాలున్నాయని వాటి ద్వారా పంపకాలు జరుగుతాయని అన్నారు. నైలు నదిని 11 దేశాలు పంచుకుటున్నాయని, అలాగే పాకిస్థాన్ నుంచి మన దేశం 5 నదుల నీటిని పంచుకుంటోందని గుర్తుచేశారు. మన రాష్ట్రాలకు కూడా ఆ రకంగానే పంపకాలు చేస్తారని కేసీఆర్ తెలిపారు. ఉద్యోగుల సమస్యపై జై భారత్, గిర్ గ్లానీ, సుందరేశన్ త్రిసభ్య కమిటీ నివేదికలు చదవి సీఎం మాట్లాడాలని సూచించారు.
అబద్దాలు చెప్పి విడిపోయే వేళ వివాదాలతో ముఖాలు చూసుకోలేని పరిస్థితి తీసుకురాకండని హితవు పలికారు. సచివాలయ ఉద్యోగుల్లో తీవ్ర అసమతౌల్యం నెలకొందన్నారు. గతంలో 83 వేలమంది ఆంధ్ర ఉద్యోగులను పంపించాలని ఆంధ్రా ముఖ్యమంత్రులే చెప్పారన్నారు. వెయ్యేళ్లు బతకాలని ఎవరూ రాలేదని భవిష్యత్ తరాలకు మంచి చేద్దామని పిలుపునిచ్చారు. వలస వచ్చినవారు సిటీని కబ్జా చేస్తామనడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రజల్లో అపోహలు తొలగించడానికే తాను మీడియా ముందుకొచ్చానని కేసీఆర్ తెలిపారు. తాను చెప్పిన విషయాల్లో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే ముఖ్యమంత్రితో ఓపెన్ డిబేట్ కి సిద్దమని కేసీఆర్ సవాలు విసిరారు.