: సమైక్యాంధ్ర జేఏసీ భవిష్యత్ కార్యాచరణ
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో మహోద్యమం జరుగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లమీదకు వచ్చి నిరసనలు, ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. దీంతో ఉద్యమానికి ఒక రూపం తీసుకొచ్చేందుకు, తెలుగు వారి ప్రతిష్ఠ మసకబారకుండా ఉంచేందుకు సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ వెల్లడించింది. కాగా, ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ సందర్భంగా కాస్త వెలుసుబాటు కల్పిస్తూ పదవ తేదీ వరకు ఏ కార్యక్రమానికి పిలుపునివ్వలేదు.
11 వ తేదీన రైల్ రోకో నిర్వహించనున్నారు. 12 వ తేదీన విద్యార్థులతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నారు. 13వ తేదీన గుంటూరు జిల్లావ్యాప్త బంద్, నిరసన ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తరువాత వేసిన ఆంటోనీ కమిటీకి చట్టబద్దత లేనందున దాన్ని ఆ పార్టీ నేతలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రకు ప్యాకేజీలు అవసరం లేదని రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ నాయకులు జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి ఉద్యమంలోకి దూకాలని డిమాండ్ చేశారు. మండల, గ్రామస్థాయి కమిటీలుగా ప్రజలు ఏర్పడి ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఉద్యమ నాయకులు పిలుపునిచ్చారు. తెలుగు వారి భవిష్యత్తు మన చేతుల్లో ఉందని దాన్ని నాశనం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని అందుకు పదవులే అడ్డని అనుకుంటే వాటిని తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్దపడాలని సమైక్యాంధ్ర జేఏసీ పిలుపునిచ్చింది.