: ఈ వాజమ్మలా రాష్ట్రాన్ని విభజించేది?: దేవినేని ఉమ
టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ కాంగ్రెస్ అధిష్ఠానంపై నిప్పులు చెరిగారు. చాతకాని ప్రధాని, అసమర్థ నేతలా రాష్ట్రాన్ని విభజించేది? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంతం నిప్పులగుండాన్ని తలపిస్తున్నా ప్రధాని మన్మోహన్ నోరు విప్పడంలేదని, ఆయన మౌనముద్రను వీడి తాజా పరిణామాలపై స్పందించాలని ఉమ డిమాండ్ చేశారు. ఇక, సరిహద్దుల్లో పాక్ సైనికులు మన జవాన్లను చంపేస్తే, పార్లమెంటులో తప్పుడు ప్రకటనలు చేసి, ఆనక లెంపలేసుకున్న రక్షణ మంత్రి ఆంటోనీ రాష్ట్రాన్ని విభజించడానికి వస్తున్నాడన్నారు. మన రాష్ట్రాన్ని విడగొట్టేందుకు ఈ ఆంటోనీ ఎవరని ఉమ ప్రశ్నించారు. బ్రిటీష్ వాళ్ళకు తొత్తుగా పనిచేసిన కుటుంబం నుంచి వచ్చిన దిగ్విజయ్ కు ఏం అర్హత ఉందని రాష్ట్ర విభజనపై మాట్లాడతారని మండిపడ్డారు.
అంతేగాకుండా, ఆల్మట్టి ఎత్తుపెంచి రాష్ట్ర రైతుల పొట్టగొట్టిన వీరప్ప మొయిలీ కూడా మన రాష్ట్రంపై నిర్ణయం తీసుకునేంతవాడయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలోపనిగా కేంద్ర మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, పురందేశ్వరిపైనా విమర్శల వర్షం కురిపించారు. వీళ్ళు రాజీనామా చేస్తే సోనియా తప్పక దిగివస్తుందని సూచించారు. చిరంజీవి, కావూరి, పురేందశ్వరిలకు చీమూ నెత్తురు ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు సీఎం ఒక వాదం, డిప్యూటీ సీఎం మరొక వాదం వినిపిస్తూ చిత్రమైన పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.