: 50 ఏళ్లలో దేశంలో 220 భాషలు అంతర్ధానం
ఎన్నో భాషలకు భారతదేశం పుట్టినిల్లు వంటిది. కానీ అభివృద్ధి, ప్రపంచీకరణ దెబ్బకు గత 50 ఏళ్ల కాలంలో 220 భాషలు అంతరించిపోయాయి. వడోదరకు చెందిన భాషా పరిశోధనా, ప్రచురణ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. 2011 నుంచి రెండేళ్ల పాటు దీనిని నిర్వహించారు. దేశంలో 1961 నాటికి 1,100 భాషలు ఉంటే వాటిలో 220 భాషలు అంతరించిపోయాయని అధ్యయనంలో పాల్గొన్న గణేష్ దేవ్ తెలిపారు.
తాము 780 భాషలను గుర్తించామని, ఉనికిలో లేని 100 భాషలను వదిలేస్తే.. మిగతా భాషలన్నీ అంతరించిపోయినట్లుగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వీటిలో ఎక్కువ భాషలు సంచార జాతులు మాట్లాడేవేనన్నారు. ప్రభుత్వం గుర్తించకపోవడం వల్లే ఆయా భాషలకు ఆ గతి పట్టిందని గణేష్ దేవ్ అభిప్రాయపడ్డారు. అలాగే ఆయా వర్గాలు చెల్లాచెదురు కావడం, జీవనోపాధి లేకపోవడమేనని చెప్పారు.