: పెద్దవారికి మేలుచేసే చాకొలేట్
పెద్దవారికి రోజుకు రెండు కప్పుల చాకొలేట్ ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని, అలాగే అల్జీమర్స్ ముప్పును కూడా తప్పించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. వయసు పెరిగేకొద్దీ మతిమరుపు రావడం సహజం. అయితే ఇలా రాకుండా ఉండేందుకు రోజుకు రెండు కప్పుల చాకొలేట్ తాగితే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.
బోస్టన్‌లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో వయసు పెరిగిన వారికి రోజుకు రెండు కప్పుల చాకొలేట్ ఇవ్వడం వల్ల వారిలో మతిమరుపును తగ్గించవచ్చని తేలింది. వీరు 73 సంవత్సరాల వయసున్న సుమారు 60 మందిని తమ అధ్యయనానికి తీసుకున్నారు. వీరు అధ్యయనానికి తీసుకునే సమయానికి వారికి ఎలాంటి చిత్త చాంచల్యం లేకుండా ఉండేవారిని ఎంపిక చేసుకున్నారు. వారికి రోజుకు రెండు కప్పుల చాకొలేట్‌ను ఒక నెలరోజుల పాటు ఇచ్చారు. తర్వాత వారి జ్ఞాపకశక్తిని పరీక్షించారు. వీరందరికీ మెదడులోని రక్త ప్రసరణ వేగాన్ని కనుగొనేందుకు అల్ట్రా సౌండ్ పరీక్షలను నిర్వహించారు.
వీరిలో కొద్దిమందికి మెదడులో రక్తప్రసరణ వేగం తక్కువగా ఉండేదని, చాకొలేట్ తాగడం వల్ల వీరిలో రక్త ప్రసరణ వేగం చాలా వరకూ మెరుగయ్యిందని పరిశోధకులు తెలిపారు. మెదడుకు రక్త ప్రసరణ వేగంగా జరగడం వల్ల మెదడు పనితీరు కూడా మారుతుంది. మెదడు చక్కగా ఆలోచించడానికి అధిక శక్తి అవసరం అవుతుంది. దీనికి రక్త ప్రసరణ వేగంగా జరగాల్సి ఉంటుంది. అయితే వయసు పెరిగేకొద్దీ రక్తప్రసరణ వేగం తగ్గడంతో అది మతిమరుపు వ్యాధికి దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మతిమరుపును తగ్గించుకోవడానికి రోజుకు రెండు కప్పుల చాకొలేట్ తాగడం ద్వారా మెదడు పనితీరును మెరుగు పరచుకోవచ్చని, అలాగే మతిమరుపును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.