: వేల సంవత్సరాలకుముందే మన జన్యు నిర్మాణం జరిగింది
భారతీయుల జన్యునిర్మాణం కొన్ని వేల సంవత్సరాలకు ముందే స్థిరపడిందని పరిశోధకులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది.
దేశంలో కుల వ్యవస్థ ఆవిర్భావం కారణంగా కుల వివాహాలు జరుగుతున్నాయని, దీనివల్ల వివిధ వర్గాల మధ్య సంకరణం తగ్గిపోయిందని పరిశోధకులు తెలిపారు. భారతీయుల ప్రస్తుత జన్యునిర్మాణం దాదాపుగా రెండు నుండి నాలుగు వేల సంవత్సరాల మధ్య జరిగిందని వీరి అధ్యయనంలో తేలింది. దేశీయ ప్రజలు, విదేశీ వలసదారుల కలయిక కారణంగా ఇది ఏర్పడిందని పరిశోధకులు వివరించారు. కుల వివాహాల కారణంగా తర్వాత జాతుల మధ్య సంక్రమణం తగ్గిపోయిందని ఫలితంగా తరువాతి జాతుల మధ్య కలయిక తగ్గిపోయి జన్యు నిర్మాణం స్థిరపడిందని పరిశోధకులు తెలిపారు.
ప్రస్తుత కాలంలో కులాల వారీగా వివాహాలు జరుగుతుండడం వల్ల గత కొన్ని వేల సంవత్సరాల్లో ఆయా తెగలకే ప్రత్యేకమైన వ్యాధులు పెరిగిపోయాయని పరిశోధనలో పాలుపంచుకున్న కుమారస్వామి తుంగరాజ్ తెలిపారు. జనాభా సంకరం జరగడానికి ముందు ఉన్న భారతీయుల నిర్మాణం నేటి తీరుకు చాలా భిన్నంగా ఉండేదని ఈ పరిశోధనలో పాల్గొన్న హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన శాస్త్రవేత్త డేవిడ్ రెయిచ్ చెబుతున్నారు.