: కొత్త పార్టీ ప్రకటించిన బైరెడ్డి
'రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ' పేరుతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటుచేసిన సభలో బైరెడ్డి పార్టీ పేరును ప్రకటించారు. ఈ పార్టీ పదవుల కోసం కాదని, ప్రజల కోసమే ఏర్పాటు చేశామని తెలిపారు. సీమకు ద్రోహం చేస్తున్న ఇంటి దొంగలను ఇంటికి పంపడానికే ఈ పార్టీ ఆవిర్భావం అని స్పష్టం చేశారు. రాయలసీమకు కొంతకాలంగా అన్యాయం జరుగుతోందన్నారు. తాను సీమవాసుల హక్కుల కోసం పోరాడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తమ పార్టీ గుర్తు 'తిమ్మమ్మ మర్రిమాను' అని చెప్పారు.
ఈ మర్రిమాను రాయలసీమ ప్రాంతంలో సుప్రసిద్ధ సందర్శనా స్థలం. సుమారు 19,107 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ చెట్టు విస్తరించింది. ఈ చెట్టు కొమ్మలే 8 ఎకరాల్లో పరుచుకుని ఉన్నాయట. ఈ మహావృక్షం వయసు 203 ఏళ్ళు అని తెలుస్తోంది. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు ఈ చెట్టును సందర్శిస్తే పిల్లలు పుడతారని ప్రతీతి.