: ఐఏఎస్ ను చంపేందుకు ప్రయత్నించిన ఇసుక మాఫియా


ఇసుక మాఫియా ఆగడాలకు అంతం లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ లో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపినందుకు దుర్గాశక్తి నాగ్ పాల్ అనే ఐఏఎస్ అధికారిని 40 నిమిషాల్లో సస్పెండ్ చేయించారు రాజకీయ నాయకులు. ఆ వివాదం ఇంకా ముగింపుకు రాకముందే హిమాచల్ ప్రదేశ్ లో ఓ యువ ఐఏఎస్ అధికారిని ఏకంగా చంపేసేందుకు ప్రయత్నించింది ఇసుక మాఫియా. ఈ అధికారి కూడా దుర్గాశక్తి నాగ్ పాల్ బ్యాచ్ కు చెందిన వ్యక్తి కావడం ఇక్కడ కాకతాళీయం.

సిమ్లాకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలన్ జిల్లా నాలాగఢ్ లో సబ్ డివిజనల్ మెజిస్ట్రేటుగా పని చేస్తున్న యూనుస్ ఖాన్ అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ వాహనాన్ని తన సిబ్బందితో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అది గమనించిన వాహనం డ్రైవరు తన వాహనంతో అధికారి వాహనాన్ని ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అలా నాలుగు సార్లు ప్రయత్నించడంతో అతని వాహనమే అదుపు తప్పి బోల్తా పడడంతో దాన్ని వదిలి పలాయనం చిత్తగించాడు. రాజకీయనాయకుల అండదండల వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అధికారులు విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News