: పచ్చి వెల్లుల్లి నమిలితే ప్రాణాంతక వ్యాధి పరార్!
వెల్లుల్లిని మనం తరచు కూరల్లో ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా మసాలా కూరల్లో. ఈ వెల్లుల్లికి అల్లం జతచేసి అత్యద్భుతమైన రుచిని తెప్పిస్తుంటాం. మాంసం తదితర వంటకాల్లో ఇది లేకపోతే నాలుక ఇట్టే పసిగట్టేస్తుంది. ఇక ఆ విషయాన్ని పక్కనబెడితే, వెల్లుల్లిలో ఔషధ విలువలున్నాయని మనవాళ్ళు వేదకాలంనాడే చెప్పారన్న సంగతి తెలిసిందే. తాజాగా చైనా పరిశోధకులు మరింత ముందుకెళ్ళి, కేన్సర్ ను రూపుమాపే గుణం దీనికుందని వెల్లడించారు. పచ్చి వెల్లుల్లి రెబ్బలను వారానికి రెండుసార్లు నమిలితే చాలట. ముఖ్యంగా ఊపిరితిత్తుల కేన్సర్ ను ప్రబలకుండా నిరోధించవచ్చని జియాంగ్జు శాస్త్రవేత్తలంటున్నారు.
దాదాపు 30 శాతం కేన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చని తమ పరిశోధనలు నిరూపించాయని వారు తెలిపారు. మొత్తం 1424 మంది ఊపిరితిత్తుల కేన్సర్ సోకిన రోగులపై వెల్లుల్లితో ప్రయోగాలు చేశారట. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ వంటి పదార్థం యాంటీ ఆక్సిడాంట్ గా పనిచేస్తుందని, అది కేన్సర్ కణాలపై సమర్థవంతంగా పోరాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.