: కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలను ఎప్పుడూ సమస్యల సుడిగుండంలోకి నెట్టడమే ఆ పార్టీకి అలవాటని దుయ్యబట్టారు. కేంద్రం అనాలోచిత నిర్ణయం కారణంగా రాష్ట్రంలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నాయని అన్నారు. హైదరాబాదు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన ప్రపంచ చేనేత దినోత్సవ కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా స్వప్రయోజనాలకోసమే పనిచేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తుందని వ్యాఖ్యానించారు.
ఇక, రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నా గ్రామాల్లో విద్యుత్ కోతలు విధిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అంతకుముందు చేనేత కార్మికుల గురించి మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వస్తే నేతన్నల జీవితాలను సుందరమయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులెందరో ఉన్నా చేనేత కార్మికుల బ్రతుకుల్లో మార్పేమీ రాలేదని అన్నారు.