: హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగువారందరి శ్రమ ఉంది: టీడీపీ ఎంపీలు
హైదరాబాద్ నగరాభివృద్ధిలో తెలుగువారందరి శ్రమ ఉందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి పేర్కొన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి జటిలం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ కమిటీల పేరుతో నాటకాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రజలు రోడ్లెక్కి పోరాడుతుంటే పార్టీ పరమైన కమిటీ వేసి పరిష్కరిస్తామని అబద్దాలు చెబుతున్నారని విమర్శిచారు. సమస్య పరిష్కారానికి మూడు ప్రాంతాల నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యులతో కమిటీ వేయాలని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ వేసే కమిటీని ఇతర పార్టీలు ఎలా సంప్రదిస్తాయని ఎంపీ సుజనా ప్రశ్నించారు. దిగ్విజయ్, మొయిలీలతో మొరపెట్టుకునేందుకు తెలుగు ప్రజలేమన్న వారి బానిసలా? అని మరో ఎంపీ సీఎం రమేష్ ధ్వజమెత్తారు. అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకునేందుకే కాంగ్రెస్ పార్టీ మరో కమిటీ వేసిందని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కాంగ్రెస్ వైఖరి వల్లే ప్రజలకు రోడ్లెక్కాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో తెలుగు ప్రజల హక్కుల పరిరక్షణకు టీడీపీ ఎల్లప్పుడూ ఉద్యమిస్తుందని టీడీపీ ఎంపీలు తెలిపారు.