: 'ఆస్కార్' అవార్డుల సందడి మొదలైంది


హాలీవుడ్.. ప్రపంచ సినిమాకి తలమానికం అనదగ్గ ఆంగ్ల చిత్రసీమ. ఇప్పుడక్కడ ఎటుచూసినా పండుగ వాతావారణమే. నటీనటులందరూ తమ జీవితంలో ఒక్కసారైనా అందుకోవాలని పరితపించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మరో రెండ్రోజుల్లో జరగనుండడమే ఇందుకు కారణం. ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చే కొడాక్ థియేటర్ తుదిమెరుగులు దిద్దుకుంటోంది.

తమ హావభావాలతో ఆయా పాత్రలకు ప్రాణం పోసిన నటులు.. సినిమాకు వన్నెలద్ది జీవకళ ఆపాదించిన సాంకేతిక నిపుణులు.. దర్శకుడి మదిలో మెదిలే ప్రతి భావాన్ని తమ మాటలతో చిత్రికపట్టే రచయితలు.. సన్నివేశాలకు స్వరాలతో నగిషీలు చెక్కే సంగీత దర్శకులు.. సెల్యులాయిడ్ పై దృశ్య కావ్యాలను ఆవిష్కరించే దర్శకులు.. ఒకరేమిటి.. మేకప్ ఆర్టిస్టులు, సౌండ్ రికార్డిస్టులు.. ఇలా సినిమా నిర్మాణంలో పాలుపంచుకునే 24 విభాగాల నిపుణులు ఇప్పుడు జపించే పేరొక్కటే.. ఆస్కార్.

ఈ నెల 25న ఈ  ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదాన కార్యక్రమం అలరించనుంది. మొత్తం 9 సినిమాలకు నామినేషన్లు దక్కాయి. వాటిలో ప్రముఖంగా వినిపిస్తున్న సినిమాల పేర్లు 'లింకన్','లైఫ్ ఆఫ్ పై'. ఇక ఉత్తమ నటుడిగా అవార్డు రేసులో బ్రాడ్లీ కూపర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నటీమణుల విషయానికొస్తే.. 86 ఏళ్ల ఎమ్మాన్యుయెల్లా రివా ఆస్కార్ బరిలో నిలిచి ఆశ్చర్యంలో ముంచెత్తింది.

 'అమోర్' సినిమాలో నటనకు రివా ఈ  ప్రతిష్ఠాత్మక పురస్కారానికి నామినేట్ అయింది. ఇక 9 ఏళ్ల వయసుకే ఆస్కార్ బరిలోకి ఉరికిన చిన్నారి క్వివెన్ వాలిస్ సినీ విశ్లేషకులను అబ్బురపరుస్తోంది. 'బీస్ట్స్ ఆఫ్ సదరన్ ల్యాండ్' సినిమాలో క్వివెన్ ప్రదర్శించిన హృద్యమైన నటన ఆమెను ఆస్కార్ పురస్కారం ముంగిట నిలిపింది. 

  • Loading...

More Telugu News