: సోనియాతో సీమాంధ్ర మంత్రుల సమావేశం... ఎందుకు?


సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ఈ మేరకు ఆమె సీమాంధ్ర మంత్రులకు అవకాశమిచ్చారు. సీమాంధ్ర మంత్రులు తమ ప్రాంత ప్రజల మనోభావాలను అధినేత్రి ముందుకు తీసుకెళ్లడానికి అని చెబుతున్నప్పటికీ, వాస్తవం ఏంటంటే లోక్ సభ సజావుగా సాగడానికి ఎంపీలను అదుపుచేయాల్సిందిగా సోనియా పిలిపించినట్టు సమాచారం. ఇప్పటికే సభాసమయం తీవ్రంగా వృధా అవుతోందని, దీంతో కాంగ్రెస్ నేతలు టీడీపీ ఎంపీల ఆందోళనలో పాలు పంచుకోవద్దని హెచ్చరించే అవకాశముందని సీమాంధ్ర ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ మధ్యాహ్నం రాయలసీమకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెను కలిసిన సందర్భంగా ఆమె రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదని తెలిపారు. 'ఇంకేదైనా కోరుకోండి, ఆ ఒక్కటీ తప్ప అన్నట్టు... విభజన ఆగదని' వారికే స్పష్టం చేస్తే విభజన నిర్ణయాన్ని ముందుగానే చెప్పిన మంత్రులతో చర్చించేది ఇంకేముంటుందనేది కాంగ్రెస్ పార్టీ వాదన. కాగా, మరోవైపు టీడీపీ లోక్ సభలో ఆందోళనతో సీమాంధ్రుల ఆదరణ అందుకుంటోంది. అవసరమైతే పనిష్మెంట్ ఏదైనా అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నాము కానీ విభజనను రాజీలేకుండా అడ్డుకుంటామంటున్న టీడీపీ ఎంపీల పట్టుదల పట్ల ఆ ప్రాంత ప్రజల ప్రశంసలు అందుతున్నాయి.

సభా సమయంలో ఎంపీలు ఆందోళన చేస్తుంటే మంత్రులు స్పందించకుండా ఉన్న తీరు సామాజిక సైట్లలో ఫొటోలుగా దర్శనమిస్తుండడంతో వారి తీరుపై సీమాంధ్రులు మండిపడుతున్నారు. ముందు ఆహార భద్రత బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉన్నందున దాన్ని పాస్ చేయించగలిగితే చాలు అన్నది కాంగ్రెస్ వ్యూహం. అందుకు సీమాంధ్ర ఎంపీలు అడ్డుతగల కుండా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. దాంతోనే వీరి భేటీలో తమ పార్టీ ఎంపీలను అదుపుచేయాలని సూచించేందుకే ఈ భేటీ అని పలువురు భావిస్తున్నారు. సీమాంధ్ర మంత్రులు మేడమ్ తో భేటీ తరువాత, మీడియా ముందుకు వచ్చి, ప్రజల మనోభావాలు అధినేత్రి దృష్టికి తీసుకువచ్చామని చెబుతారని టీడీపీ ఎంపీలు ఎద్దేవా చేస్తున్నారు.

  • Loading...

More Telugu News