: విదేశీ రాయబార కార్యాలయాల నుంచే తీవ్రవాదులకు నిధులు
పొరుగు దేశాల్లో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలు, విదేశీ గూఢాచార సంస్థల నుంచే దేశంలో తీవ్రవాదులకు నిధులు అందుతున్నట్లు కేంద్ర మంత్రి ఆర్ పీఎన్ సింగ్ లోక్ సభలో తెలిపారు. ఇందుకు సంబంధించి నివేదికలు కూడా ఉన్నట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం తీవ్రవాదులు, వేర్పాటువాదులు హవాలా, ఇతర మార్గాల ద్వారా నిధులను పోగు చేసుకుంటున్నట్లు వివరించారు.
ఇక పొరుగు దేశాల్లోని విదేశీ గూఢచార సంస్థలు తీవ్రవాదులకు డబ్బును అందించడంవల్లే భారతదేశంలో నకిలీ కరెన్సీ నోట్లు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఇక కేంద్ర, రాష్ట్ర ఎన్ ఫోర్స్ మెంట్ సంస్థల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. 2006 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు మొత్తం 218 ఎఫ్ఐఆర్ లు రిజిస్టర్ అయ్యాయని, 65 కేసుల్లో ఛార్జ్ షీట్లు నమోదైనట్లు వెల్లడించారు.