: స్తన్యమిచ్చే తల్లులకు అల్జీమర్స్ ముప్పు తక్కువ
శిశువుకు స్తన్యమిచ్చే తల్లులు వృద్ధాప్యంలో భయంకరమైన మతిమరుపు వ్యాధి అల్జీమర్స్ బారిన పడకుండా ఉంటారని కేంబ్రిడ్జ్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. 70 నుంచి 100 సంవత్సరాల వయసుగల 81 మంది మహిళలపై వారు ఈ అధ్యయనం నిర్వహించారు. మొదటి శిశువుకు జన్మనిచ్చిన వయసు, మెనోపాజ్ లోకి ప్రవేశించిన వయసు, విద్య, పొగతాగడం, ఆల్కహాల్ ఇలా ఎన్నో అంశాలను పరిశీలించారు. ముఖ్యంగా వారు తమ శిశువులకు ఎంతకాలం పాటు పాలు ఇచ్చారన్న దాన్ని నోట్ చేసుకున్నారు.
స్తన్యమివ్వని అమ్మల కంటే ఇచ్చిన వారిలో అల్జీమర్స్ వ్యాధి ముప్పు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. ఎక్కువ కాలం పాటు పాలిచ్చిన వారిలో అల్జీమర్స్ ముప్పు చాలా తక్కువగా ఉందట. అలాగే, గర్భవతిగా ఉన్న కాలం కంటే(తొమ్మిదినెలలు) తక్కువ కాలం పాలిచ్చిన వారిలో ఈ వ్యాధి ముప్పు ఎక్కువేనని గుర్తించారు. స్తన్యమివ్వడం వల్ల అటు శిశువుకు ఆరోగ్యం, ఇటు తల్లికీ ఆరోగ్యకరమని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి.