: సోనియాకు కృతజ్ఞతలు : డీఎస్
విస్తృత సంప్రదింపుల తరువాతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ జల విహార్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదని అన్నారు. విస్తృత సంప్రదింపుల తరువాతే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఒక దశలో తెలంగాణ అంశం వెనక్కి వెళ్లిందని, అయినా తాము సోనియా గాంధీని ఒప్పించామని ఆయన అన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలోనే తాను తెలంగాణ కోసం మాట్లాడానన్నారు. రాష్ట్రపతి సహా అందరు కేంద్ర మంత్రులను కలిసామన్నారు.
డిసెంబర్ 9 ప్రకటన తరువాత అన్ని పార్టీలను అభిప్రాయాలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కోరిందని స్పష్టం చేశారు. అందరూ అనుకూలంగా నివేదికలు ఇవ్వడంతో నెహ్రూ, ఇందిరలు ఇవ్వకపోయినా సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఎన్నో జేఏసీలు పాటుపడ్డాయని చెబుతూ, ప్రధానంగా ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టులకు ధన్యవాదాలని డీఎస్ అన్నారు. ఆంధ్రుల అరాచకాలు ఎన్నో ఏళ్లుగా భరిస్తూ వెనకబాటుతనాన్ని అనుభవించామని పలు కమిటీలకు చెప్పామని అన్నారు. సోనియా వల్లే తమ కల సాకారమైందని, 'ఆమెకు కృతజ్ఞతలు' అని డీఎస్ తెలిపారు.