: బిడ్డను అమ్మేసిన డాక్టర్
దారుణాలకు అంతం లేకుండాపోతోంది. చైనాలో ఓ డాక్టర్ అప్పుడే జన్మించిన శిశువును అమ్మేసిన వైనం నివ్వెరపరుస్తోంది. చైనా వాయువ్య ప్రాంత రాష్ట్రమైన షాంగ్జి రాష్ట్రంలో ఆ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లో కెళితే.. ఫుపింగ్ కౌంటీలోని మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఆసుపత్రిలో ఝాంగ్ అనే వైద్యుడు రూ.2 లక్షలకు కక్కుర్తిపడి ఓ మగశిశువును విక్రయించాడు. ఆ శిశువుకు ఏదో వ్యాధి సోకిందని, తన వద్దే ఉంచుకుని చికిత్స చేస్తానని ఆ పసికందు తల్లిదండ్రులతో డాక్టర్ నమ్మబలికాడు. అనంతరం, ఆ బిడ్డను తీసుకెళ్ళి అమ్మేశాడు. అనుమానం వచ్చి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డాక్టర్ గుట్టురట్టయింది. ఆ శిశువును సెంట్రల్ హెనాన్ రాష్ట్రంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉందని భావిస్తున్న మరో ఆరుగురిని అరెస్టు చేశారు.