: షర్మిళ వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం జిల్లా వైఎస్సార్సీపీ నేత రాజీనామా
ఖమ్మం జిల్లా వైఎస్సార్సీపీ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణపై ఇచ్ఛాపురంలో షర్మిల వ్యాఖ్యల పట్ల మనస్తాపానికి గురై ఆయన రాజీనామా చేసినట్టు సన్నిహితుల సమాచారం. మరోవైపు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. సీమాంధ్రులకు తాగు సాగునీరు లేకుండా చేసేందుకే రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందని షర్మిల మండిపడింది. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సముద్రం నీరు తప్ప మంచి నీరు ఎక్కడిదని అడిగారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రులకు భాగం లేదా? అని ప్రశ్నించారు. దీంతో షర్మిళ వ్యాఖ్యలపట్ల తెలంగాణలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదంటూ, ఇప్పుడెలా సీమాంధ్రకు మద్దతు పలుకుతారని తెలంగాణలోని పలు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రాజకీయంగా లబ్ది పొందడానికి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అంటోంది.