: ముంబై ప్రత్యేక రాష్ట్రంపై సెలబ్రిటీల స్పందనలు
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సెలబ్రిటీ రచయిత్రి శోభాడే ఒక చిన్న అంశాన్ని చర్చకు పెట్టారు. పాయింటు చిన్నదైనా.. అది చాలా మంది మనసులలో కలకలం కలిగించింది.'మహారాష్ట్ర అండ్ ముంబై?? ఎందుకు విడిపోకూడదు? స్వతంత్ర ప్రాంతంగా ముంబైకు ప్రత్యేకత ఉంది' అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అంటే ముంబైని ప్రత్యేక రాష్ట్రంగా ఎందుకు చేయకూడదనేది శోభాడే స్పష్టమైన అభిప్రాయం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం వెలువడడంతో శోభాడే ఈ ఆసక్తికరమైన అంశాన్ని చర్చకు పెట్టారు.
దీనిపై సీనియర్ నిర్మాత మహేష్ భట్ స్పందిస్తూ.. ముంబై మహారాష్టకు రాజధానిగా ఉంది, అలాంటప్పుడు ఎలా కుదురుతుంది? అంటూ ట్వీట్ చేశారు. ముంబైని ప్రత్యేక రాష్ట్రంగా చేయడానికి ఎలాంటి కారణం లేదన్నారు. ముంబై నగరం మహారాష్ట్రతోనే కాకుండా దేశమంతటితో అనుసంధానమై ఉందన్నారు. ఇక డైరెక్టర్ అభినయ్ దేవ్ స్పందిస్తూ.. ముక్కలు చేయడం ఏ మాత్రం మంచిది కాదన్నారు. మరో డైరెక్టర్ మిలాన్ లూత్రియా అయితే, ప్రస్తుతం ఉన్నట్లుగానే ఇక ముందూ ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.