: మితంగా తింటేనే మంచిది
మధ్యాహ్నం పూట లంచ్ చేయడంలో ఆఫీసుల్లో పనిచేసేవారిలో కొందరు లంచ్ బాక్స్‌లు తెచ్చుకుంటారు. కొందరు అలా స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి హోటళ్లలో తినేసి వస్తుంటారు. అయితే ఇలా బయటికి వెళ్లి తినే సమయంలో స్నేహితులతో కలిసి మాట్లాడుతూ కొందరు ఎక్కువగా లాగించేస్తుంటారు. అలా ఎక్కువ తిన్నప్పుడు తర్వాత మనం చేసే పనిలో నాణ్యత లోపిస్తుందంటున్నారు అధ్యయన కర్తలు.
బెర్లిన్‌కు చెందిన కొందరు అధ్యయనవేత్తలు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లి భోజనం చేసేవారితో పోలిస్తే కూర్చున్న చోటే భోజనం చేసేవారిమీద సానుకూల ప్రభావం పడుతుందంటున్నారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో స్నేహితులతో అలా బయటికి వెళ్లి, రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేసినప్పుడు కాస్త ఎక్కువ తినే అవకాశం ఉంటుందట. దీని ఫలితం మన మెదడు పనితీరుమీద ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అతిగా తినడం వల్ల చాలాసేపటివరకూ పనిమీద శ్రద్ధ పెట్టడం సాధ్యం కాదు. ఒక్కోసారి మనం చేసే పనిలో కూడా నాణ్యత లోపించడం, తప్పులు దొర్లడం వంటివి జరుగుతాయి. అంతేకాదు అతిగా తినడం వల్ల మనసుకూడా విశ్రాంతిని కోరుకుంటుంది. కాబట్టి మధ్యాహ్నం పూట బయటికి వెళ్లినా మితాహారం తీసుకుంటే మంచిది. అదికూడా త్వరగా తినడం కానిచ్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు... ఉన్నచోటునే మన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తిన్నా... లేదా కాసేపు పక్కకు జరిగి ఓ ఐదు పది నిముషాల తర్వాత తిరిగి పనిచేయడం వల్ల మన మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందంటున్నారు పరిశోధకులు.