: చిరంజీవి దిగజారుడుతనం వల్లే విభజన: దేవినేని ఉమ
తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర మంత్రి చిరంజీవి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమ.. చిరంజీవిపై మరోమారు విరుచుకుపడ్డారు. చిరంజీవి అడ్రెస్ ఎక్కడ? అంటూ నిన్న ప్రశ్నించిన ఉమ, నేడు మరికాస్త జోరు పెంచారు. చిరంజీవి దిగజారుడుతనం వల్లే రాష్ట్ర విభజన చోటు చేసుకుందని దుయ్యబట్టారు. పదవి కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసన జ్వాలలు చూసైనా కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని ఉమ డిమాండ్ చేశారు. ఇక, అంతా తానైనట్టు వ్యవహరిస్తున్న దిగ్విజయ్ సింగ్ పూటకోమాట మాట్లాడుతున్నాడని, విభజనపై మాట్లాడేందుకు ఆయనకున్న అర్హతలేంటని ప్రశ్నించారు. ఉమ ఈ ఉదయం తిరుమల విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు.