: ఫేస్ బుక్ ద్వారా కలిసిన అన్నదమ్ములు!
యాంత్రిక జీవనానికి అలవాటుపడిన వారికి వినోదాన్ని పంచడం, ఎక్కడెక్కడివారి మధ్య చెలిమికి నాంది పలుకుతున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్. తాజాగా దీనిద్వారా ఇద్దరు అన్నదమ్ములు పదకొండేళ్ల తర్వాత కలిశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అంకుష్ దోమ్లే, సంతోష్ దోమ్లే అన్నదమ్ములు. వీరి కుటుంబం పుణెలో ఉంటోంది. ఓ రోజు తన తల్లి తిట్టిందన్న కోపంతో అంకుష్ చెప్పకుండా పుణె నుంచి పారిపోయాడు. చివరికి గురుద్వార్ చేరి అక్కడ సిక్కు మతంలోకి మారాడు. అక్కడే గుడిలో దేవుడికి నిత్యం సేవలు చేస్తూ గడుపుతున్నాడు.
ఓ రోజు తన తమ్ముడిని, కుటుంబాన్ని కలుసుకోవాలని అంకుష్ కు కోరిక కలిగింది. దాంతో, ఫేస్ బుక్ వెదికి తమ్ముడు సంతోష్ దోమ్లే అకౌంటును కనుక్కున్నాడు. వెంటనే వివరాలతో రిక్వెస్టు పెట్టాడు. సంతోష్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఆనందంతో అన్నను ఇంటికి రమ్మని చెప్పాడు. ఇంటికి వెళ్లిన అంకుష్ తల్లి, తమ్ముడిని కలుసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. 11 సంవత్సరాల తర్వాత అంకుష్ ఇంటికి రావడంతో వారి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.