: 13 జిల్లాల్లో చేసేది సమైక్యాంధ్ర ఉద్యమం ఎలా అవుతుంది?: హరీశ్ రావు


ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తమ ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిందే అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా.. వివరణ ఇచ్చేందుకే టీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. కేవలం 13 జిల్లాల్లో చేసేది సమైక్యాంధ్ర ఉద్యమం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం చేసే ఉద్యమం తెలంగాణ జిల్లాల్లో కూడా ఉండాలి కదా? అని ఆయన ఎత్తిచూపారు. అలాంటప్పుడు ఆ ఉద్యమాన్ని సీమాంధ్ర ఉద్యమంగానే పరిగణించాల్సి ఉంటుందని సూత్రీకరించారు.

ఇక విభజన అనంతరం భయాందోళనలు ఉండడం సహజమేనంటూ.. విడిపోవడం పట్ల ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సీమాంధ్ర ప్రజలకు సూచించారు హరీశ్ రావు. అప్పట్లో విడిపోయిన మహారాష్ట్ర, గుజరాత్ నేడు అద్భుత ప్రగతి సాధించాయని, పంజాబ్, హర్యానా కూడా ప్రగతిపథంలో ముందుకెళుతున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బాటలో తెలంగాణ, సీమాంధ్ర కూడా పురోగామి పథంలో పయనిస్తాయని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. కేసీఆర్ సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదన్నారు. ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతాలకు వెళతారని వ్యాఖ్యానించారే తప్ప, ఆయన మాటల్లో ఎలాంటి దురుద్ధేశంలేదని స్పష్టం చేశారు. మీడియాలో కొన్ని పక్షాలు సంయమనం పాటించాలని హితవు పలికారు. అయినా, కేసీఆర్ గత ప్రభుత్వాలు, రాజ్యాంగం చెప్పిన విషయాలే చెప్పారంటూ మేనమామను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.

తాజాగా సీమాంధ్రలో చెలరేగుతున్న ఉద్యమ జ్వాలలను అణచివేయడంపై సర్కారు చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్లు వాడొద్దని ఆదేశాలు జారీ చేస్తోందని చెప్పారు. విగ్రహాలు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయిపోతున్నా పోలీసులు నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ తాము ప్రభుత్వ ఆస్తులకు విఘాతం కలిగించలేదన్నారు.

  • Loading...

More Telugu News