: సీడబ్ల్యూసీ నిర్ణయం చారిత్రక తప్పిదం: తులసీరెడ్డి
తెలంగాణ ప్రకటనపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి స్పందించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆ నిర్ణయం దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి గొడ్డలి పెట్టుగా మారే అవకాశముందని అది ఒక దేశభక్తుడిగా తనను బాధించిందన్నారు. అందుకే సీడబ్ల్యూసీ నిర్ణయం చారిత్రక తప్పిదమని అభిప్రాయపడ్డారు. తొలి ప్రధాని నెహ్రూ, తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని సమైక్యతను చాటారని, ఆ తరువాత ఉక్కుమహిళ ఇందిరాగాంధీ.. ఒకవైపు తెలంగాణ, మరో వైపు జై ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే తాను సమైక్యవాదినని ఆమె స్పష్టం చేశారన్నారు.
అంతెందుకు, రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు బూర్గుల రామకృష్ణారావు, బెజవాడ గోపాల్ రెడ్డి ఇద్దరూ రాష్ట్రం, తెలుగు ప్రజలు విడిపోకూడదని కోరుకుని తమ ముఖ్యమంత్రి పదవులు వదులుకున్నారని గుర్తుచేశారు. నవరస నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు కూడా తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది అని రాష్ట్ర ప్రజల సమైక్యతను చాటారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ప్రతి ఇల్లూ ఆదర్శంగా నిలవాలని సమైక్యతనే తపించారని అన్నారు. అలాంటిది ఇప్పడు ఎవరి కోసం అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందో తెలీదని అన్నారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభీష్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని అందుకనుగుణంగా అధిష్ఠానం తన నిర్ణయాన్ని వాపసు తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.