: విభజనకు దిగ్విజయ్ ఎవడు? స్వార్థానికి ముక్కలు చేస్తారా: టీడీపీ ఎంపీలు
విభజించాం అని చెప్పడానికి దిగ్విజయ్ సింగ్ ఎవరు? అని టీడీపీ ఎంపీలు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నామని ప్రకటన చేసి, రాజీనామాలంటూ దొంగనాటకాలకి తెర తీసిన కాంగ్రెస్ నేతల తీరు దొంగలే దొంగదొంగ అంటూ పరుగెడుతున్నట్టు ఉందని మండిపడ్డారు. స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు ఎలా చేస్తారని ధ్వజమెత్తారు. దేని ప్రాతి పదికన విభజన చేస్తున్నారో చెప్పాలని టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. 50 లక్షలు ఖర్చు చేసి శ్రీకృష్ణ కమిటీ వేశారు. ఆ కమిటీలోని ఏ క్లాజ్ ప్రాతిపదికన విభజన చేస్తున్నారో చెప్పాలని అడిగారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నట్టేనా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సుప్రీమా? అని దుయ్యబట్టారు. విభజన ఎలా చేస్తారు? అన్ని ప్రాంతాలకు సమ్మతమా? కాదా? అన్నది చూడాల్సిన అవసరం ఉందా? లేదా? అని ప్రశ్నిచారు. 1999లో వైఎస్ ఇచ్చిన లెటర్ ఆధారంగా రాష్ట్రాన్ని ముక్కలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు ముందే అన్నీ తెలుసని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. విభజనపై రోడ్ మ్యాప్ లేకుండా, ప్రజలను సంప్రదించకుండా, ప్రజల అనుమానాలు నివృత్తి చేయకుండా ఎలా విభజిస్తారని వీరు ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ నేతలు నంగనాచి కబుర్లాడుతున్నారని, హఠాత్తుగా జగన్ పై విచారణ నెమ్మది కావడానికి కారణం తెలంగాణ విభజనపై నిర్ణయమే అని ఆరోపించారు. కేసీఆర్ తో ములాఖత్ అయి లోపాయికారీ ఒప్పందం చేసుకున్నది కాంగ్రెస్సేనని, అందుకు దిగ్విజయ్ మాటలే సాక్ష్యమని అన్నారు. కేసీఆర్, జగన్, కాంగ్రెస్ కలిపి నాటకాలు ఆడి ఇప్పడు టీడీపీ మీద పడుతున్నారని టీడీపీ ఎంపీలు మండి పడ్డారు.