: ఇన్సాట్ 3డి శాటిలైట్ గతి తప్పిందా?
గత నెలలో ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్షంలోకి పంపించిన ఇన్సాట్ 3డి ఉపగ్రహం అంతరిక్షంలో తప్పిపోయిందా? ఈ సందేహం భారత శాస్త్రవేత్తలను భయోందోళనలకు గురిచేసింది. అయితే ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ మాత్రం 'స్వల్ప వ్యవధి పాటు మాస్టర్ కంట్రోల్ నుంచి ఉపగ్రహానికి సంబంధాలు తెగిపోయాయి' అని తెలిపారు. కానీ, ఆయన ప్రకటన అస్పష్టంగా ఉండడంతో ఉపగ్రహం దొరికిందా? లేదా? అనే అనుమానాలు రేకెత్తాయి. ఆ వెంటనే ఇస్రో పలు నష్టనివారణ చర్యలకు ఉపక్రమించి ఎట్టకేలకు ఆ శాటిలైట్ ను నిర్ధేశిత కక్ష్యలో పునఃప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా, శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, ప్రస్తుతం ఉపగ్రహం సవ్యరీతిలో పనిచేస్తోందని తెలిపారు. మరో వారం రోజుల్లో పని ప్రారంభిస్తుందని అన్నారు. ఈ ఇన్సాట్ 3డి ఉపగ్రహం వాతావరణ, ప్రకృతి విపత్తులు గుర్తించేందుకు ఉద్దేశించి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన శాటిలైట్ గా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.