: టాలీవుడ్ పై తెలంగాణ ఎఫెక్ట్ ఉండదు: తమ్మారెడ్డి
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన అనంతరం ప్రభావితమయ్యే రంగాల్లో సినీ రంగం కూడా ఒకటని విశ్లేషకులు తొలి నుంచీ చెబుతున్నదే. ఎందుకంటే, 1990లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నై నుంచి తరలి హైదారాబాదులో స్థిరపడింది. టాలీవుడ్ పేరిట ఇక్కడి నుంచే చిత్ర నిర్మాణం సాగుతోంది. నటులు, సాంకేతికనిపుణులు అందరూ ఇక్కడే నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం రెండు ముక్కలు కావడంతో సినీ పరిశ్రమ భవితవ్యంపై ఆసక్తి నెలకొంది. ఇక్కడే ఉంటుందా? ఆంధ్ర ప్రాంతంలో మరెక్కడికైనా తరలి వెళ్ళనుందా? అన్న దానిపై తీవ్రస్థాయిలోనే చర్చలు జరుగుతున్నాయి. ఈ సందేహాలకు సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వివరణ ఇచ్చారు.
నేడు హైదరాబాదులో పీటీఐతో మాట్లాడుతూ, ఇప్పటికైతే టాలీవుడ్ కు వాటిల్లిన నష్టం ఏమీలేదని చెప్పుకొచ్చారు. 12,000 కోట్ల విలువైన తెలుగు చిత్రసీమపై తెలంగాణ ప్రభావం ఏమీ ఉండబోదని అన్నారు. భవిష్యత్తులో ఏమైనా సమస్యలొస్తే అప్పుడు ఆలోచిస్తామని బదులిచ్చారు. ఏదేమైనా, తాము ఏ ప్రాంతంలో రాయితీలు బాగుంటే ఆ ప్రాంతానికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.