: సింగిల్ వికెట్ తో చితకబాదారు
జింబాబ్వేతో టీమిండియా నాలుగో వన్డే ఏకపక్షంగా ముగిసింది. ఇప్పటికే సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ అప్రాధాన్యపు మ్యాచ్ లో ఆతిథ్య జట్టు పేలవ ఆటతీరు కనబరిచింది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 9 వికెట్ల తేడాతో జింబాబ్వే జట్టును చిత్తు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 42.4 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది.
స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 23 పరుగుల వద్ద ఓపెనర్ పుజారా (13) వికెట్ కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ రోహిత్ శర్మ (64 నాటౌట్) కు సురేశ్ రైనా (65 నాటౌట్) జతకలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు అభేద్యంగా 122 పరుగులు జోడించి భారత్ ను గెలుపుతీరాలకు చేర్చారు. భారత్ 30.5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 145 పరుగులు చేసి లక్ష్యాన్ని అధిగమించడం విశేషం. ఈ విజయంతో భారత్, ఐదు వన్డేల సిరీస్ లో 4-0తో ఆధిక్యం సాధించింది.