: కొత్త నేస్తంతో ధోనీ బిజీబిజీ
మైదానంలో భావరహితంగా కన్పించే టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఆఫ్ ద ఫీల్డ్ లో ఎన్నో వ్యాపకాలున్నాయన్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైకులు, బిజినెస్ డీల్స్, యాడ్స్ అగ్రిమెంట్లతో ఎప్పుడూ బిజీగా ఉంటాడు. అయితే, ఎన్ని పనులున్నా, కుటుంబానికి, ముఖ్యంగా పెంపుడు జంతువులతో ఆడుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తాడు. ఇటీవలే ధోనీ పెంపుడు జంతువుల జాబితాలో లియా కూడా చేరింది. లియా ఎవరనేగా మీ డౌటు. లియా ఓ శునకం. అందమైనది సుమా. అందుకే, మహి మనసు దోచింది. దీంతో, ఆడుకుంటుంటే అసలు టైమే తెలియడంలేదని ఈ కెప్టెన్ కూల్ అంటున్నాడు. ఓ యానిమల్ ట్రస్టు నుంచి ఈ కుక్కపిల్లను ధోనీ దత్తత తీసుకున్నాడు. దాన్ని హిందీలో లేహ్ అని, ఇంగ్లిష్ లో లియా అని పిలుస్తున్నట్టు చెప్పాడు. అయితే, ఎలా పిలిచినా కుయ్ కుయ్ మంటూ వచ్చి ఒళ్ళో కూర్చుంటుందని మురిసిపోయాడు. ధోనీ, ఇంతకుముందు 2011లో ఓ పులిని దత్తత తీసుకుని దానికి 'అగస్థ్య' అని నామకరణం చేశాడు.