: 'పదేళ్ళు'.. ఎన్నేళ్ళయినా కావచ్చు!


కేంద్రం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తూ, హైదరాబాదును పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, వాస్తవిక దృష్టితో చూస్తే ఇది సాధ్యం కాకపోవచ్చంటున్నారు కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఎలాగంటే.. రాజ్యాంగంలో 'ఉమ్మడి రాజధాని' అనే పదమే లేదని, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అనే ఉందని, ఒక నగరం రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉండొచ్చని ఎక్కడా లేదని వారు వివరించారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాదును తప్పనిసరిగా కేంద్రపాలిత ప్రాంతంగానే పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. అప్పుడు నగరాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ పాలిస్తాడని, కేంద్రం పర్యవేక్షిస్తుందని విపులీకరించారు.

ఇక, భాగ్యనగరం పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పినా.. అది కేంద్రపాలిత ప్రాంతంగా రూపాంతరం చెందే అవకాశాలే ఎక్కువని వారు అంటున్నారు. అందుకు ఉదాహరణగా చండీగఢ్ ను ప్రస్తావించారు. చండీగఢ్ ను పదేళ్ళపాటు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు రాజధానిగా 1966లో తీర్మానించారు. పదేళ్ళ తర్వాత పంజాబ్ కే చండీగఢ్ దక్కాలని పేర్కొన్నారు. అక్కడ హర్యానాకు తొలుత చండీగఢ్ తో భౌగోళిక అనుసంధానం లేకున్నా, మరికొన్ని ప్రాంతాలను ఆ రాష్ట్రంలో కలిపి అవసరమైన 'కనెక్టవిటీ'ని సాధించారు. ఇప్పుడది కేంద్రపాలిత ప్రాంతంగా ఏలుబడిలో ఉంది. తాజాగా హైదరాబాదు విషయంలోనూ అలాగే జరగొచ్చంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేయడం వల్ల కనెక్టివిటీ సాధ్యమవుతుందన్నది నిపుణుల మాట.

  • Loading...

More Telugu News