: సాల్వడార్ డాలీ ‘కాలం కన్ను’ కొత్త రికార్డు
సర్రియలిజం అనే చిత్రకళకు ప్రపంచంలోనే ఆద్యుడిగా చెప్పుకునే సాల్వడార్ డాలీ.. తన యావత్తు జీవితకాలంలో 20 రకాల ఆభరణాల్ని కూడా డిజైన్ చేశాడనేది చాలా మందికి తెలియని సంగతి. ఆ 20 రకాల ఆభరణాల్లో ఆయన తన ప్రియమైన భార్యకోసం కూడా ఒక చిన్న మూడు అంగుళాల బంగారు నగ (బ్రూచ్)ను ‘కాలం కన్ను’ అనే పేరుతో రూపొందించారు. 1949లో ఆయన దీన్ని తయారుచేశారు.
తాజాగా ఈ ‘కాలంకన్ను’ ను బెర్క్‌షైర్‌లో వేలం వేస్తే రికార్డుస్థాయి ధరకు అమ్ముడుపోయింది. దీనిని ఔత్సాహికులు మన రూపాయల్లో అయితే.. 58 లక్షల 34 వేల 880 రూపాయలకు కొనుక్కున్నారన్నమాట. నీలి ఎనామెల్ ఉన్న బంగారు గడియారం కంటిపాపలాగా, దాని చుట్టూ బంగారంలో వజ్రాలు పొదిగి కంటిరెప్పలుగా కనిపించే ఈ కళాఖండాన్ని ఎల్‌మనీ అండ్ ఎర్ట్‌మ్యాన్ అనే సంస్థ తయారుచేసింది. సాల్వడార్ డాలీ దీన్ని డిజైన్ చేశారు. అయితే ఎల్‌మనీ సంస్థ డాలీ అనుమతితో.. 1950లలో పలు నమూనాలను తయారుచేసి విక్రయించింది. ఇప్పుడు వేలం వేసింది కూడా అలాంటి నమూనాల్లో ఒకటేనట.