: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ: విశ్లేషకులు
రాష్ట్ర విభజనకు నిర్ణయం జరిగిపోయింది. ఏదైనా ఊహించని పెద్ద మార్పు జరిగితే తప్ప ఇది ఆగే అవకాశం లేదు. 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేస్తూ కేంద్ర మంత్రి మండలికి నివేదించింది. విభజన తర్వాత ఆంధ్ర, రాయలసీమతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. ఈ లోపు సీమాంధ్ర ప్రాంతంలో నూతన రాజధాని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు.
పదేళ్ల గడువు ఇచ్చినా, సాధారణంగా కొత్త రాజధాని ఏర్పాటు ప్రక్రియ మూడేళ్లలోపే పూర్తి కావడానికి అవకాశాలు ఉన్నాయి. రాజధానిగా ప్రాంతం ఎంపిక ఒక్కటే సమస్య. ఆ తర్వాత నిర్మాణానికి రెండేళ్ల సమయం సరిపోతుంది. సీమాంధ్ర భౌగోళికంగా చాలా పొడవుగా ఉంటుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ చూస్తే దూరం చాలా ఎక్కువ. రాజధాని ఏర్పాటుకు అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండే స్థలాన్ని ఎంపిక చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదొక్కటే కాదు, ప్రభుత్వ భవనాలకు స్థలాల లభ్యత, విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు ఇతర ప్రాంతాలతో రవాణ వసతులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా చూస్తే విజయవాడ ప్రాంతానికి ఎక్కువ అనుకూలతలు ఉన్నాయని పాలనా నిపుణులు చెబుతున్నారు.
విశాఖ పట్టణం హైదరాబాద్ తర్వాత ఎక్కువగా అభివృద్ధి చెందిన నగరం. ఇక్కడ పెద్ద ఓడరేవు, రైల్వే స్టేషన్, విమానాశ్రయం, ఆయిల్ రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రములు ఉన్నాయి. కానీ ఒకవైపు బీచ్ ఉండడం, విస్తరణకు పెద్దగా అవకాశాలు లేకపోవడం అననుకూలం. పైగా చిత్తూరు ఇతర రాయలసీమ జిల్లాలకు ఇది చాలా దూరంలో ఉంటుంది. రాజమండ్రిలో స్థలాల లభ్యత సమస్య ఉంది. ఒంగోలులోనూ అంతే. ఒకప్పుడు రాజధానిగా ఉన్న కర్నూలు పట్టణం విషయానికొస్తే ఇతర ప్రాంత నేతలు అంత సుముఖంగా లేరు. ఒంగోలు, కర్నూలులో విమానాశ్రయాలు లేవు. తిరుపతి ఓ చివర ఉంటుంది.
అదే విజయవాడ-గుంటూరు నగరాల మధ్య రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక్కడ వేలాది ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. రెండు నగరాలు పెద్దవి. రైల్వే స్టేషన్లూ పెద్దవే. నీటి లభ్యత సమస్య లేకుండా పక్కనే కృష్ణా నది ఉంది. గన్నవరంలో విమానాశ్రయం ఉంది. ఇది ఇప్పటికే వ్యాపార రాజధానిగా ఉంది. అటు శ్రీకాకుళం, ఇటు చిత్తూరు జిల్లాలకు మధ్యలో ఉంటుంది. పైగా ఇక్కడ రాజధాని ఏర్పాటుతో జంట నగరాలుగా వృద్ధి చెందుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.