: నాలుగు విషయాలు తేల్చకుండా ఎలా విభజిస్తారు: జూపూడి ప్రభాకర్
జల విధానం స్పష్టం చేయకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ జల పంపిణీలో సుప్రీం తీర్పును కూడా లెక్క చేయని పలు రాష్ట్రాలు ఉన్నాయని, అవి యధేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. ఉదాహరణకు మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు జలవిధానాలను ఎప్పటికప్పడు ఉల్లంఘిస్తూనే ఉన్నాయన్నారు. అలాంటప్పడు ఇక్కడ ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా ఎలా ప్రకటిస్తారని జూపూడి ప్రశ్నించారు. అలాగే రెవెన్యూను ఏ రకంగా పంచనున్నారో చెప్పలేదని అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ వ్యాట్ చెల్లించినా అది హైదరాబాద్ లోనే జమ అవుతుందంటూ, అది ఏ రకంగా పంచుతారో స్పష్టం చేయలేదన్నారు. అలాగే హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఎలా పంచనున్నారని మండిపడ్డారు. దానికి తోడు కొత్త రాజధానిని ఎక్కడ, ఎలా ఏర్పాటు చేస్తారని సూటిగా అడిగారు. అదే కాకుండా కాంగ్రెస్ మూడు ప్రాంతాలను సంక్షోభంలోకి నెట్టిందని జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.