: పోలవరానికి జాతీయ హాదా?... సీమాంధ్రకు కొత్తరాజధాని?.. ఎలా
సీడబ్ల్యూసీ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. దాంతో పాటే పోలవరానికి జాతీయ హోదా ఇస్తామని ప్రకటించింది. నదీ జలాల ఒప్పందాలు రెండు రాష్ట్రాలకు వర్తిస్తాయని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి నిధులను తామే చెల్లిస్తామని తెలిపింది. దీంతో పాటు ఆచరణ కష్టమైన సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు కూడా తన బుజస్కంధాలపైనే వేసుకుంది యూపీఏ. సీమాంధ్రలో సాగుకు పనికి రాని నగరపరిథిలో ఉన్న వేల ఎకరాలు ఎక్కడా లేవు. కాగా రాజధాని నిర్మాణానికి ఎంతమంది నిరాశ్రయులు కావాల్సి ఉందో స్పష్టం చేయలేదు. ఏదో హడావుడి ప్రకటనే తప్ప దీనికి ఒక శాస్త్రీయత లేదని పలువురు మేధావులు మండిపడుతున్నారు.
రాజధాని నిర్మాణాన్ని మరో పదేళ్లలో పూర్తి చేస్తామంటున్న యూపీఏ మాటలు ఉత్తర కుమారుడి ప్రగల్భాల్లానే కన్పిస్తున్నాయి తప్ప ఆచరణ సాధ్యంగా కన్పించడం లేదు. హైదరాబాద్ ను ఇలా తయారు చేసేందుకు 50 ఏళ్లు పట్టింది. యూపీఏ చెబుతున్నట్టు పదేళ్లలో రాజధానులు తయారైపోతే దేశంలో ఇంకెన్ని మెట్రొపాలిటన్ నగరాలు తయారై ఉండేవో అని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియంల నిర్మాణానికే ఐదు, పదేళ్ల ప్రణాళికలు వేసుకుంటే కానీ తయారు కావడం లేదని అంటూ ఒలింపిక్స్ సందర్భంగా చైనా పడిన తపనను చూపిస్తున్నారు. దీంతో యూపీఏ ప్రకటన ఉత్తరకుమారుడి ప్రగల్భాల్లా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.