: భూతాపానికి మరో కారణం కూడా ఉందట!
భూతాపం పెరిగిపోవడానికి ఇంతకాలం మానవ తప్పిదాలే కారణం అనుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు మరో కారణం కూడా భూతాపం పెరిగిపోవడానికి తోడవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేమంటే తరచూ భూకంపాలు రావడం కారణంగా భూతాపం పెరిగిపోతోందని శాస్త్రవేత్తలు పరిశోధించి నిర్ధారించారు.
భూతాపం పెరిగిపోవడానికి సంబంధించిన కారణాల్లో భూకంపాలు ఏమేరకు భాగంగా ఉన్నాయి? అనే విషయంలో శాస్త్రవేత్తల బృందం ఒక ప్రత్యేక అధ్యయనం నిర్వహించింది. ఈ పరిశోధనలో భూకంపాలు సంభవించినపుడు వాటిద్వారా వెలువడే మీథేన్ వాయువు కూడా భూతాపం పెరిగిపోవడానికి కారణమవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 1945లో ఉత్తర అరేబియా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టరు స్కేలుపై 8.1గా నమోదైంది. తర్వాత కాలంలో సముద్రంలో సంభవించిన మార్పులను తెలుసుకునేందుకు 2007లో బ్రెమెన్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ పరిశోధకుల బృందం ప్రత్యేక పరిశోధన చేపట్టింది.
భూకంపం సంభవించిన తర్వాత ఒకచోట సముద్రగర్భం నుండి గ్రీన్‌హౌస్ వాయువైన మీథేన్ దాదాపు 7.4 మిలియన్ క్యూబిక్ మీటర్లమేర విడుదలైనట్టు గుర్తించారు. ఇది దాదాపు పది పెద్ద గ్యాస్ ట్యాంకర్ల మొత్తానికి సమానమని, ఇలాంటివి సముద్రంలో మరిన్నిచోట్ల విడుదలై ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇలా విడుదలైన మీథేన్ హైడ్రేట్లు ఆ తర్వాత పలు రసాయనిక చర్యలకు గురై, నీటితో కలిసి గడ్డలుగా మారినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తాము నమూనాలను సేకరిస్తుండగా, సముద్రమట్టానికి కేవలం 1.6 మీటర్ల దిగువనే ఇవి లభించాయని, భూతాపానికి ఇవికూడా కారణమవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.