: తలరాతకాదు చేతిరాతతో చెప్పేయొచ్చు!
మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని మనం ఇంతకాలం అనుకునేవాళ్లం. అయితే అలా కాదు... మన తలరాతకంటే మన చేతిరాత మన ఆరోగ్యాన్ని గురించి ఇట్టే చెప్పేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. మన చేతిరాత ద్వారా మన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఇట్టే తెలుసుకోవచ్చట.
శాస్త్రవేత్తలు మన చేతిరాత ద్వారా మన నాడీ సంబంధ సమస్యలను గుర్తించేలా ఒక ప్రత్యేక సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఈ సాధనాన్ని వ్యక్తి చేతికి అమర్చి ఆ వ్యక్తి చేత ఒక ట్యాబ్లెట్‌పై రాయించడం ద్వారా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి మెదడుకు సంబంధించిన, నాడీ సంబంధమైన వ్యాధులను ఇట్టే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేంద్ర నాడీవ్యవస్థని ప్రభావితం చేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి రోగాలను ఈ రాతప్రక్రియ ద్వారా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల చేతులు వణకడం, వేళ్ళు బిగిసిపోవడం, కదలికలు మందకొడిగా ఉండడం, నిలకడగా కుదురుగా రాయలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ పరిస్థితులను 'ఎలక్ట్రోమయోగ్రఫీ' (ఈఎంజీ)సాయంతో ముందే కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈఎంజీ ఆయా వ్యక్తుల కండరాలు, నాడీకణాల పనితీరును ఇట్టే పసిగడుతుంది. వాటికి సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని విశ్లేసించి నమోదు చేస్తుంది. దీనిద్వారా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ముప్పును గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.