: ఇతడో మహా రక్తదాత
ప్రమాదకర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోయే కేసులు దేశంలో ఎన్నో. పాజిటివ్ గ్రూపు రక్తం అయితే పర్లేదు కానీ, నెగిటివ్ గ్రూపు రక్తం దొరకడం చాలా కష్టం. రక్తం అవసరం బాబూ.. అంటే కొంతమంది ఇవ్వడానికి సంకోచిస్తారు. ఇస్తే నీరసం వస్తుందేమో? ఆరోగ్యం, బలం పోతుందేమో అన్న అనుమానాలు వారిలో మానవత్వాన్ని అణిచేస్తాయి. కానీ ఇలాంటి వారందరూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహారక్తదాత 42 ఏళ్ల శరద్ కుమ్రే గురించి తప్పక తెలుసుకోవాలి.
శరద్ ఇప్పటి వరకూ 50 సార్లు రక్తదానం చేశారు. 90 రక్తదాన శిబిరాలను నిర్వహించారు. రక్తదానం ఇవ్వాలంటే భయపడే ఎంతోమంది తనను చూసి ఇప్పుడు ధైర్యంగా ముందుకు వస్తున్నారని శరద్ చెబుతున్నారు. గతంలో భయపడ్డవారే రక్తదాన శిబిరం ఎప్పుడు పెడుతున్నారంటూ తనను అడుగుతున్నారని చెప్పారు. 'ఒకే ఒక్కసారి రక్తాన్ని దానం చేయండి.. మీలో భయం పారిపోకపోతే అడగండి' అంటూ స్థానికులను ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. శరద్ సోదరి ఉగ్రవాదుల కాల్పులో తీవ్రంగా గాయపడి రక్తం దొరకక ప్రాణాలు విడిచింది. ఆయన మేనల్లుడు కూడా ఇలానే మరణించాడు. అందుకే, రక్తం విలువ తెలిసినవాడిగా మహా రక్తదాన ఉద్యమాన్ని చేపట్టారు. ఈయనలో పర్యావరణ వేత్త కూడా దాగున్నాడు. మధ్యప్రదేశ్ లోని మారుమూల పల్లెల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు.