: దేశ ఆర్ధిక పురోగతిపై చిదంబరం కామెంట్
భారతదేశం ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండో ఆర్ధిక వ్యవస్థేనని ఆర్ధికమంత్రి చిదంబరం పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రపంచంలో మొదటి స్థానంలో చైనా ఉంటే ఆ తర్వాత స్థానంలో భారత్ ఉందని గుర్తు చేశారు. కాబట్టి, తగ్గుతున్న ఆర్ధికవృద్ధి రేటు పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఆరు శాతం వృద్ధి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమిళనాడులోని ఆయన నియోజకవర్గం శివాంగలో ఇండియన్ బ్యాంకు 2,110వ బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా చిదంబరం ప్రసంగించారు. ఒకప్పుడు 10 శాతం ఉన్న చైనా ఆర్ధికవృద్ధి కూడా ప్రస్తుతం 7 శాతానికి పడిపోయిందని, తొమ్మిది శాతం ఉన్న మన వృద్ధిరేటు 5 శాతానికి చేరిందన్నారు. అయితే, ఆర్ధిక మాంద్యం అన్ని దేశాల్లో ఉందన్న చిదంబరం, ప్రపంచంలో వృద్ధిరేటు నెమ్మదిగా కొనసాగుతుండటంవల్ల భారత్ కు ఎలాంటి ముప్పులేదని వివరించారు.
యూరప్ దేశాల్లో కూడా ఆర్ధిక తరుగుదల ఫ్రభావం ఉందని.. మెక్సికో, బ్రెజిల్ దేశాలు భారత్ తర్వాతే ఉన్నాయని వెల్లడించారు. దీనివల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పిన ఆర్ధికమంత్రి బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని వ్యవసాయం రంగం, చిన్న పరిశ్రమలు, గృహ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచించారు. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 108 అమెరికన్ డాలర్లు ఉండటంవల్లనే పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెరిగాయని చిదంబరం ఈ సందర్భంగా చెప్పారు.