: రికార్డులు బద్ధలు కొడతాం: అద్వానీ సమరోత్సాహం
వచ్చే ఎన్నికల్లో రికార్డులు బద్ధలు కొడతామంటున్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ. 2014లో ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం స్వంతం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యక్రమంలో అద్వానీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ, ప్రస్తుతం దేశంలో గాలి బీజేపీవైపే వీస్తోందన్నారు. ఇక ముందస్తు ఎన్నికల నిర్వహించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇది ఒపీనియన్ పోల్స్ చెబుతున్న వాస్తవం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లోపు అవినీతి మచ్చను చెరిపేసుకోవడానికే ప్రయత్నిస్తుందని, తాము వారి తప్పిదాలను ఎత్తిచూపే విధంగా అజెండా రూపొందించుకుని రికార్డు విజయం సాధిస్తామని అద్వానీ చెప్పుకొచ్చారు.